తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం (Thiruchendur Sri Subrahmanya Swami temple)
పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు.
కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.
ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి
తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి:
తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.
ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.
ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.
అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.
ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.
ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే
“శరవణభవ”…ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.
Leave a Comment