వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు.
పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువు ప్రార్ధించగా! నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను గంగిరెద్దువానిగా వేషము ధరించి గంగిరెదును ఆడించి గజా సురుని మెప్పించి ఉదర కుహరమందున్న పరమశివుని కోరినాడు. అంత విష్ణు మాయను గ్రహించి, తనకు చేటుకాలము దాపరించినదని తలచి, శివుని ప్రభూ! శ్రీహరి ప్రభావముచే నా జీవితము ముగియనున్నది. నా యనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము నిమ్మని తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి శివునకు ఉదర కుహరము నుండి విముక్తి కలిగించాడు.
ఆ శుభవర్తమానము తెలిసిన పార్వతి అభ్యంగన స్నానమాచరించి భర్తను స్వాగతించాలని తలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మ చేసి దానికి ప్రాణ ప్రతిష్టచేసి స్నానవాకిట ముందు కాపలాగా ఉంచినది. అంత పరమశివుడు సంతోష ముతో పార్వతి చెంతచేరాలని వచ్చిన ఆ పరమేశ్వరుని చూసిన ఆ బాలుడు అభ్యంతర మందిరము నందు నిలువరించగా! ఆ బాలునికి శిరచ్ఛేదము చేసినాడు. అది చూచిన మహేశ్వరి దుఃఖమును తీర్చుటకై తన వద్దనున్న ఆ గజశిరమును ఆ బాలునకు అతికించి ప్రాణ ప్రతిష్టచేసి, “ఆ గజాననునికి, తన రెండవ కొడుకైన కుమారస్వామికి మధ్య భూప్రదక్షిణ పోటీ పెట్టి త్రిలోకపూజితుడుగా గణాధిపత్యము ఆ బాలునికి కలిగించినాడు. ముల్లోకములందు పూజలందుకుంటూ కైలాసము చేరుకునే వింత స్వరూపు డైన వినాయకుని చూచి! చంద్రుడు విరగబడి నవ్వినాడు. అంత వినాయకుడు కోపించి ఓరి “చవితి చంద్రుడా! ఈ రోజునుండి నిన్ను చూసిన వారందరు నీలాప నిందలు పాలవుదురు గాక! అనిశపించెను. అంత చంద్రుడు తన తప్పిదాన్ని మన్నించమని పరిపరివిధాల ప్రార్థించగా, “భాద్రపద శుద్ధ చవితి”నాడు నా జన్మ వృత్తాంతము జన్మదినమున విని నన్ను పూజించి నాకధాక్షతలు శిరస్సున ధరించిన వారికి నీలాపనిందలు కలుగవని శాపవిమోచన అనుగ్రహించాడు. తొలుత ఈ వినాయక చవితి వ్రత మాహాత్మ్యమును పరమశివుడు కుమార స్వామికి తెలియజేయగా! అట్టి ఈ వ్రత కథను నైమిశారణ్యమందు సూతమహర్షి శౌనకాది మునులకు చెప్పే సమయాన వనవాసము చేస్తున్న ధర్మరాజు కూడా విని ఈ వ్రతమాచరించి తిరిగి రాజ్య సంపదను పొందెను.
దమయంతి యిూ వ్రత మాచరించి నలమహారాజును పొందెను. శ్రీకృష్ణుడంతటివాడు పాలపాత్రయందు చవితి చంద్రుని చూచి నీలాపనిందలపాలై ! ఈ వ్రతమాచరించి, అటు శమంతక మణితోపాటుగా జాంబవతి, సత్యభామ అను ఇద్దరు కాంతామణులను పొంద గలిగినాడు. మానవులు అట్టి ఈ వ్రతమును చేయుట వల్ల సమస్త సిరిసంపదలు పుత్రపౌత్రాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సుఖ సౌభాగ్యములు పొందుతారని సూత ముని శ్రేష్ణుడు వివరించినాడు. ఇట్టి మాహాత్మ్యముగల ఈ సిద్ధి వినాయక వ్రతము మనమంతా భక్తి ప్రపత్తులతో ఆచరించి పునీతులమౌదాము.
Leave a Comment