శ్రీ కాళరాత్రి దేవీ (Sri Kalaratri Devi)
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. “కాళరాత్రి” శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.
కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము – కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను “శుభంకరి” అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.
కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
Leave a Comment