పూరిజగన్నాథ రథ యాత్ర (Puri Jaganatha Ratha Yatra)
మన దేశము లో నాలుగు దిక్కుల పవిత్ర పుణ్యక్షేతాలను ‘ చార్ ధామ్’ గా పిలుస్తారు .
ఉత్తరాన – బదరీ,
దక్షినాన – రామేశ్వరము ,
పడమరన – ద్వారక ,
తూర్పున – పూరీ క్షేత్రాలు ఉన్నాయి .
ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో ( ఆషాడ శుద్ద విదియ నుండి )నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి మరియు విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి.కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది.
జగన్నాథ ఆలయ వంటశాల భారత దేశంలోనే అతి పెద్ద వంటశాల.సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది మరియు భోగ మండపాల లో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Leave a Comment