కార్తీక పురాణం – 16
16వ అధ్యాయము – స్తంభ దీప ప్రశంస
వశిష్టుడు చెబుతున్నాడు –
“ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసి కోటవద్దగాని – భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల – చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.
దీప స్తంభము విప్రుడగుట
ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి “ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు” అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి “ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి” అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి “పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు” డని వేడుకొనెను.
ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది “ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన” దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి “మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు”డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో “స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు”డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము – పదహారో రోజు పారాయణము సమాప్తం.
Leave a Comment