Home » Karthika Puranam » Karthika Puranam Part 10

Karthika Puranam Part 10

కార్తిక పురాణం
10వ అధ్యాయము – అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము

జనకుడు వశిష్టుల వారిని గాంచి ” మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమిజరిగెను? వివరించవలసినది”గా ప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, “ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠమునకు దీసుకొని పోయిరి. మేము చేయునదిలేక చాలా విచారించుచూ యిచటకు వచ్చినారము” అని భయకంపితులై విన్నవి౦చుకొనిరి.

“ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును” అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని “ఓహొ! అదియా సంగతి! తన అవసానకాలమున ‘నారాయణ’ అని వైకుంఠవాసుని నామస్మరణజేసి యుండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొనిపోయిరి. తెలియకగాని, తెలిసిగాని మృత్యుసమయమున హరి నామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా!” అని అనుకొనెను.

అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనము నపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరు౦డెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కలం గడుపుచు౦డెడి వాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి “నాకు యీ రొజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము”, అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకోనుచు, నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని
వంక కన్నెత్తియైననూ చూడక విటునిపై మనస్సుగలదియై మగని తూలనాడుటవలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కఱ్ఱతో బాదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలిపోయెను కదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి “ఓయీ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు ర”మ్మని కొరెను. అంత నా చాకలి “తల్లి! నీవు బ్రాహ్మణపడతివి. నేను నీచకులస్తుడును, చాకలివాడిని మీరీవిధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను” అని బుద్ది చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవా౦ఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి “అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడి గట్టితిని? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని” అని పాశ్చాత్తాపమొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవలంభించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.

కొంత కాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణి౦చుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాసమున నదీ స్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసానకాలమున ‘నారాయణా’ అని శ్రీ హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను.

బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనల ననుభవించి ఒక మాలవాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడా శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదలిపెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంతమిదియే.

నిర్మలమైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీ హరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్షమొందగలరు. గాన కార్తీకమాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహపర సుఖములు పొందగలరు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి దశమాధ్యాయము – పదవ రోజు పారాయణము సమాప్తము.

Karthika Puranam Part 1

కార్తిక పురాణం 1వ అధ్యాయము – కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను....

Karthika Puranam Part 12

కార్తిక పురాణం – 12 12వ అధ్యాయము – ద్వాదశి ప్రశంస “మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను”మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి. కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు...

Karthika Puranam Part 2

కార్తిక పురాణం 2వ అధ్యాయము – సోమవార వ్రత మహిమ శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః | తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో...

Karthika Puranam Part 5

కార్తిక పురాణం 5వ అధ్యాయము – వనభోజన మహిమ(Karthika Puranam Part 5) ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్ ద్రెళ్లక ‘మీరు మే’ మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణున౦ దుల్లము జేర్చి తారడవిను౦డుట మేలు...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!