శ్రీ కాలభైరవ స్వామీ (Sri Kalabhairava Swamy )
శ్రీ కాలభైరవ గాయత్రి మంత్రం
కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥
శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. ఈ స్వామీ కాలస్వరూపం ఎరిగిన వాడు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామీ కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వారు.
శ్రీ కాలభైరవ స్వరూపం
ఈ స్వామీ కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం,కపాలం,గద మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం.
కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.
మహోన్నతకాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.
బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.
కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత జన్మించాడు.
అష్ట భైరవులు (Ashta Bhairavulu)
శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) చండ భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) భీషణ భైరవ
8 ) ఉన్మత్త భైరవ
ఇవే కాక మహా భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ ‘కాలభైరవాష్టకం’ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.
కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు.
నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
Leave a Comment