వైకుంఠ ఏకాదశి /ముక్కోటి ఏకాదశి / పుత్రద ఏకాదశి (Vaikunta Ekadashi /Mukkoti /Puthrada Ekadashi)
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే ‘వార్త’ తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు ‘పుత్రద ఏకాదశి’ గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య ‘చంపక’కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ‘ఏకాదశీ వ్రతాన్ని’ చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.
- కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు.
- ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టేక్కాడు.
- రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తినొందాడు. సకల దేవతా కృపాపాత్రుడైనాడు. మోక్షగామి అయినాడు.
- వైఖానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు.
- అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితమే.
- క్షీరసాగర మథనం – లక్ష్మీదేవి ఆవిర్భావం ఏకాదశినాడే జరిగింది.
వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన విధివిధానాలు
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటిఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
Know more: Santhana Gopala Swamy Mantram (సంతాన గోపాల స్వామి మంత్రం)
అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే… వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి, శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పెద్దలు చెబుతున్నారు.
ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా
“ఓం నమోనారాయణాయ (అష్టాక్షరి) మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి”.
చేసిన పాపలు తొలగుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి మొదలైన వైష్ణవ ఆలయాలను దర్శించుకోవచ్చు.
వైకుంఠ + ఏకాదశి అర్థ వివరణ
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ – ఏకాదశి అని రెండు పదాలున్నాయి. ‘వైకుంఠ’ – అంటే ‘విష్ణువును’, విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. ‘చాక్షుషమన్వంతరం’ లో ‘వికుంఠ’ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠుడు” అయ్యాడు. వైకుంఠము – శ్వేతదీపమైన విష్ణుదేవుని స్థానం, పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమధామం. జీవులు వైకుంఠుడుని అర్చించి, ఉపాసించి, వైకుంఠానికి చేరుటే ముక్తి. ఇంద్రియాలు ఇంద్రియాధిస్ఠాన నారాయణున్ని సేవించుటే భక్తి కదా ! వైకుంఠము అంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం.
Know more: Santhana Gopala Swamy Mantram (సంతాన గోపాల స్వామి మంత్రం)
“మనః షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి” – అంటే గీతావాక్యానుసారం మనస్సు+10 ఇంద్రియములు అనగా పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను+ప్రాణాలను+బుద్ధిని కూడా తనతో తీసుకొని పోతుంది. జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో ఇంద్రియాలనూ ఆకర్షించి తీసుకువెళుతుంది. మనస్సంటే ‘అంతఃకరణం’.
ఈ పదకొండు ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి, వైకుంఠుడిని అర్చించి, సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రములై వాటిద్వారా సుఖానుభూతి పొందే జీవుణ్ణి వైకుంఠములో చేరుస్తాయి. కాగా “ఏకాదశేంద్రియాలను వైకుంఠార్పణం చేసి, వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తిని పొంది, ధన్యులవ్వండి – అని బోధిస్తుంది.
“వైకుంఠ ఏకాదశి” – వికుంఠమంటే … దెబ్బతిననిది. ఇంద్రియాలు “వికుంఠాలు” అయినప్పుడే వైకుంఠ సమర్చన ప్రశాంతంగా జరుగుతుంది.
ద్వాదశి – 12వ స్థితి. ఇదే ఇంద్రియాతీతదివ్యానంద స్థితి. ఏకాదశినాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం. ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు ఉంచినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవదానిపై ప్రభావం చూపిస్తాయి కదా ! అదేవిధంగా ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ వైకుంఠునికి – ఉప = సమీపంలో, వాసః =నివసించటం వలన అత్యంత దగ్గర సాన్నిధ్య ప్రభావం కారణంగా, జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. అంతట జీవుడు శుద్ధుడవుతాడు.
ఇంతటి ప్రభావసంపన్నమైన వైకుంఠ ఏకాదశినీ, ద్వాదశినీ భక్తిశ్రద్దలతో ఆచరించినవారికి పునర్జన్మ ఉండదు.
సర్వేజనా సుఖినోభవంతు