శ్రీకూర్మం క్షేత్రం (Sri Kurmam Kshetram)
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండోది అవతారం కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక క్షేత్రమే శ్రీకూర్మం ఇక్కడ స్వామివారు “కూర్మనాధ స్వామి” రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత.
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. అంతేకాదు ఈ ఆలయం మరెన్నో విశిష్ఠతలు ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి.
జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు స్వామివారి జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ప్రతి రోజూ స్వామివారి దర్శనం ఉంటుంది.
స్థల పురాణం
పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించడానికియత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు త్రిమూర్తులను ప్రార్ధించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది.
ప్రయాణ సౌకర్యాలు
బస్సులో ప్రయాణం చేసేవారు శ్రీకాకుళం పాత బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వెళ్లేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళానికి చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది.
కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి కూడా ఇక్కడకు 10 కిలోమీటర్ల దూరంలోనే నెలకొని ఉంది, ఈ రెండు ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయొచ్చు.