శ్రీ మహాగౌరి దేవీ (Sri Mahagauri Devi)
అష్టవర్షా భవేద్గౌరీ – “మహాగౌరి” అష్టవర్ష ప్రాయము గలది. అమ్మవారు గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.
పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు “మహాగౌరి” యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.
Leave a Comment