Home » Temples » Sri Kalahasti Temple
sri kalahasti temple

Sri Kalahasti Temple

శ్రీ కాళహస్తి క్షేత్రం (Sri Kalahasti temple)

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య నెలకొని ఉన్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.

నామ సార్ధకత:

శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు.

శ్రీ కాళహస్తి క్షేత్ర వైభవం:

పెద్ద పెద్ద ప్రాకారాలు గలిగిన ఆలయం రమణీయమైన శిల్ప చమత్కృతులతో విలసిల్లుతున్న ఈ ఆలయం పురాతన వైభవానికి ప్రతీకగా నిలిచిందనటంలో సందేహం లేదు. ఇక్కడగల కొండల మీద కూడ కొన్ని ఆలయాలున్నాయి. మహాశివరాత్రికి స్వామివారికి ఉత్సవ విశేషాదులు బహుధా జరుగుతుంటాయి. చుట్టు ప్రక్కలనున్న గ్రామాలనుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించి పోతుంటారు. ఇక్కడే శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి పవిత్రాశ్రమం నెలకొని వుంది. ఆయన ఒక సిద్ధ యోగి. స్వామివారి బోధనలు అమృత తుల్యములు. చాల ప్రసిద్ధము.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని ‘దక్షిణ కాశీ ‘ అని అంటారు. శ్రీ కాళ హస్తి తిరుపతికి సుమరు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. అన్ని విదాల రవాణ సౌకర్యాలున్నవి.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకము లయిన చిత్రములు వున్నాయి. ” మణికుండేశ్వరాఖ్య ” అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు.

ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాస మనియు, సత్య మహా భాస్కరక్షేత్ర మనియు , సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది.

క్రీస్తు శకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపు కొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు బయట వున్న కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.

నాలుగు దిక్కుల దేవుళ్ళు:

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

గోపురాలు:

ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా “తేరు వీధి”కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి “బిచ్చాలు” దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని “బాల జ్ఞానాంబి గోపురం” అని, ఉత్తరం గోపురాన్ని “శివయ్య గోపురం” అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని “తిరుమంజన గోపురం” అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున “సూర్య పుష్కరిణి”, ఎడమవైపున “చంద్ర పుష్కరిణి” ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

రాహు కేతు క్షేత్రము:

ఈ క్షేత్రము రాహు కేతు క్షేత్రముగా ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి “రాహు కేతు క్షేత్రము” అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి:

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందు కొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు – కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము.

తీర్ధాలు:

ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని “పాతాళ గంగ” లేదా “మూక తీర్థము”లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు:
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

Sri Kuke Subrahmanya Temple

కుక్కే సుబ్రహ్మణ్య (Kukke subrahmanya Temple) జగన్మాత పార్వతీదేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ...

Sri Nidanampati Sri Lakshmi Temple

Sri Nidanampati Sri Mahalakshmi (Neelam pati maha lakshmi temple) Adigoppula is the town close-by. away from the town after one km separate a side street prompting the fields of Adigoppla...

Sri Pashupati Ashtakam

శ్రీ పశుపతి అష్టకం(Sri Pashupati Ashtakam) పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం | ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 || న జనకో జననీ న చ సోదరో న తనయో న చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!