మంగళగౌరీ వ్రతం (Sri Mangala Gowri Vratam)
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి.
పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగగా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్థిల్లుతారు” అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
మంగళగౌరీ వ్రత నియమాలు
- తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్ఠం.
- అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.
- వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
- వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
- వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
- వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు యివ్వవచ్చును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ తరువాత, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :
పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు కుందులు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.
మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం :
వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి, ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి. మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో అభిస్తున్నాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటోని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.
Leave a Comment