శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం (Sri Kedareswara Jyotirlinga)
మహాద్రిపార్శ్వేచ తటే రామంతం, అమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైహి
సురాసురైర్యక్ష మహోరగాద్యైహి కేదారమీశం శివమేకమీడే
ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరీంత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయ తెరచి ఉంటుంది. దీపావళి రోజునస్వామికి నేటితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునెలల పాటూ ఆలయం మూసి ఉన్న సమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శన మిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారైన కేదారగౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహాద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం, ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు.
Leave a Comment