Home » Temples » Sri Kanaka Mahalakshmi Temple
kanaka maha lakshmi temple

Sri Kanaka Mahalakshmi Temple

శ్రీ కనకమహాలక్ష్మి (Sri Kanaka Mahalakshmi Temple)

విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి. ఉత్తరాంధ్ర వాసులకేగాక సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందామె. బంగారం కొన్నా వెండి కొన్నా తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా బిడ్డ పుట్టినా విశాఖప్రాంతవాసులు ఆ విశేషాన్ని కనకమహాలక్ష్మికి నివేదించి, ఆశీస్సులు అందుకోవడం ఇక్కడి ఆచారం. ఇది గోపురం లేని గుడి. మూలవిరాట్టుకు భక్తులు స్వయంగా పూజలు నిర్వహించుకోవడం ఈ క్షేత్ర విశిష్టత. ఏ వేళలో అయినా దర్శించుకునేందుకు వీలుగా 24 గంటలూ తెరిచి ఉంచే ఆలయం ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మవారిని సేవించుకున్నా, స్మరించుకున్నా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

ఇక్కడ అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం:

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుచే తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తున్నారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపై దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడవేశారనీ తర్వాత బయటకు తీసి గుడిలో ప్రతిష్టించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం వద్ద గల బావిలో స్నానమాచరించి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్టించమని అమ్మ కోరింది. కాని బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించటానికి ఉద్యుక్తురాలయ్యింది. అది చూసి భీతిల్లిన బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా, శివుడు తన దివ్యదృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అంతట మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టూ అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టూ కథనం. ఈ కథనానికి తార్కాణంగా అమ్మవారి మూలవిరాట్టు వామహస్తం మోచేతి వరకూ ఖండించబడి ఉండటాన్ని మనం చూడవచ్చు.

అమ్మవారి ఆగ్రహం:

కనకమహాలక్ష్మి ఆలయం మొదటి నుంచీ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఉంది. 1912 కాలంలో వీధి వెడల్పు చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం కదపకుండా వీధి మధ్యలోనే ఉంచేసినా 1917లో రోడ్డు మధ్యబాగం నుంచి 30 అడుగుల దూరంలో ఒక మూలగా జరిపారు. అప్పుడే విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయభ్రాంతులై అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే ఈ విపత్తు జరిగిందని భావించి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలోకి చేర్చారు. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి జనం స్వస్థత చెంది ఇదంతా అమ్మవారి మహాత్మ్యం వల్ల జరిగిందన్న ప్రగాఢ విశ్వాసం ప్రబలింది. అప్పటి నుంచి ప్రజలు అమ్మవారికి ఇతోధికంగా పూజలు చేయడం ప్రారంభించారు. కాగా, ఈ గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అంటే అమ్మకు అది ఇష్టం లేదని గ్రహించి ఆ తర్వాత ఆ ప్రయత్నాలను విరమించారు. అమ్మ సకల జనులకు అందుబాటులో ఉంటుంది. కనుకనే పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా స్త్రీలు అమ్మను ఐదవతనాన్ని ఇనుమడింపజేసే దేవతామూర్తిగా భావిస్తారు. అమ్మవారికి గురువారం ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెల్లవారినది మొదలు రాత్రి వరకు అమ్మను దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు.

అమ్మవారి మాలధారణ:

అయ్యప్ప మాల, కనకదుర్గ మాల, శ్రీశైల మాల ఉన్నట్టుగానే కనకమహాలక్ష్మి మాత కరుణకు కూడా మాలధారణ దీక్ష ఉంది. అమ్మకు ఇష్టమైన మార్గశిరమాసంలో ఈ మాలధారణ దీక్ష పాటిస్తారు. దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, ఆకుపచ్చని మాలలను వేసుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటించవచ్చ. దీక్ష ప్రారంభం రోజున గురుమాతచే ఆలయంలో ఆకుపచ్చ వస్త్రాలు ధరించి అమ్మవారికి కుంకుమపూజ చేయాలి. ఆ రోజు నుంచి దీక్ష విరమించే వరకు ప్రతి రోజూ ఉదయం, మధాహ్నం, సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి ఫొటో లేదా ప్రతిమకు అష్టోత్తర పూజలు చేసి శరణుఘోష జరపాలి. దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం, మత్తు పానీయాలు, ధూమపానానికి దూరంగా ఉండాలి. పాదరక్షలు ధరించకుండా ఏకభుక్తం చేసి రాత్రి అమ్మవారికి నైవేద్యం చేసిన పాలు, ప్రసాదం, పళ్లను భుజించాలి. నేలమీద మాత్రమే నిద్రపోవాలి. దీక్షా కాలంలో అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి పట్ల ఏకాగ్రత చిత్తం కలిగి ఉండాలి

ఈ దేవాలయం లో జరిగే ముఖ్య ఉత్సవాలు:

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రతి నవంబర్‌ డిసెంబర్‌లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. మూలవిరాట్‌కు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహిస్తుంటారు. లక్ష కుంకుమార్చన, లక్ష చేమంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కలువల పూజ, లక్ష తులసిపూజ, లక్ష గాజుల పూజ, పసుపుకొమ్ములతో పూజ… ఇవన్నీ కన్నుల పండువగా జరుగుతాయి. అలాగే శ్రావణమాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు శ్రీలక్ష్మీపూజలు (కుంకుమ పూజలు) నిర్వహిస్తారు. శ్రావణమాసం నెలరోజులు సుమారు ఐదు వేల మంది దంపతులు ఈ కుంకుమ పూజలో పాల్గొంటారు.

Ista Kameswari Temple Srisailam

ఇష్ట కామేశ్వరీ దేవీ దేవస్తానం, శ్రీశైలం (Ista Kameswari Devi temple Srisailam)   It is located in Kurnool district 15 kms near to Srisaila Malleshwara Swamy Temple. Godess Ishta kameswari devi located in small...

Puri Jaganatha Ratha Yatra

పూరిజగన్నాథ రథ యాత్ర (Puri Jaganatha Ratha Yatra) మన దేశము లో నాలుగు దిక్కుల పవిత్ర పుణ్యక్షేతాలను ‘ చార్ ధామ్‌’ గా పిలుస్తారు . ఉత్తరాన – బదరీ, దక్షినాన – రామేశ్వరము , పడమరన – ద్వారక...

Sri Chamundeshwari Shakti Peetam, Mysore

శ్రీ చాముండేశ్వరి శక్తి పీఠం, మైసూరు (Sri Chamundeshwari Shakti Peetam) ఈ క్షేత్రం కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరు కి 120 కిలోమీటర్ల దూరం లో  మైసూరు లో ఉంటుంది దీనినే క్రౌంచ పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!