శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam)
ఇంద్ర ఉవాచ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 ||
మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారం
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || 2 ||
గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ, కోలుడు అనే రాక్షసుని కి భయాన్ని సృష్టించిన దానివై, సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము.
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || 3 ||
సర్వజ్ఞురాలా’ సర్వ వరాలు ఇచ్చే దానా, సర్వ దుష్ట శక్తుల్నీ తొలగించే భయంకరీ, సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || 4 ||
అద్భుత శక్తి, జ్ఞానం కలగజేసేదానివీ, భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లీ! మంత్రమూర్తి, దివ్య కాంతిమాయీ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 5 ||
ఆది, అంతము లేని దానా, ఆదిశక్తీ,!మాహేశ్వరీ ! యోగ జ్ఞానంలో వుండేదానా! యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము
స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || 6 ||
స్థూల, సూక్ష్మ రూపంలోనూ,మహారౌద్ర రూపంలోనూ కనిపించే దానా! మహాశక్తి స్వరూపిణీ,ప్రపంచాని తనలో ధరించిన,మహా పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || 7 ||
పద్మాసనంలో కూర్చొని వుండే దానా! పరబ్రహ్మ స్వరూపిణీ, మాహేశ్వరీ! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || 8 ||
తెల్లని వస్త్రములు ధరించిన దానా! అనేక అలంకారాలు దాల్చిన దానా!జగత్ స్థితికి కారణమైనదానా! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.
ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు.
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం – పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు.అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది